గ్రామస్థాయి నుంచే కాంగ్రెస్‌ను బలోపేతం చేయాలి_ఎమ్మెల్యే కడియం శ్రీహరి
- కష్టపడి పనిచేసే వారికే పార్టీలో ప్రాధాన్యం
- కొత్త.. పాత అనే తేడా వద్దు.. అందరం కలిసి పనిచేద్దాం
- బీజేపీ, బీఆర్ఎస్ ప్రచారాన్ని తిప్పికొట్టాలి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు21 సెప్టెంబర్, 202612:55 PM

ధర్మసాగర్ 21 సెప్టెంబర్ ప్రజాధ్వని : గ్రామస్థాయి నుంచి కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని మాజీ ఉప ముఖ్యమంత్రి, స్టేషన్ ఘనపూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పార్టీ నియమావళికి కట్టుబడి, క్రమశిక్షణతో ప్రజల కోసం పనిచేసే కార్యకర్తలకు పార్టీలో తప్పకుండా ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. పేరు చెప్పుకుని ఊరేగుతానంటే తన వద్ద నడవదని, ప్రజల మధ్య ఉంటూ కష్టపడి పనిచేసే వారికి అవకాశాలు వస్తాయని అన్నారు. స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో ఇక కొత్త, పాత అనే చర్చకు తావులేదని, అందరూ కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి కృషి చేయాలని సూచించారు. ధర్మసాగర్ మండల కేంద్రంలోని సుస్మిత గార్డెన్స్‌లో నిర్వహించిన మండల, గ్రామ, అనుబంధ కమిటీల పరిచయ కార్యక్రమం, మండల విస్తృతస్థాయి సమావేశానికి వరంగల్ ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యే కడియం శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ధర్మసాగర్ మండల కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని కడియం కావ్య, హన్మకొండ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డితో కలిసి కడియం శ్రీహరి ప్రారంభించారు. అనంతరం నూతనంగా ఎన్నికైన మండల కమిటీ కార్యవర్గ సభ్యులు, గ్రామ శాఖ అధ్యక్షులను శాలువాలతో సత్కరించి అభినందించారు. ఈ సందర్భంగా కడియం శ్రీహరి మాట్లాడుతూ.. అభివృద్ధి, సంక్షేమ ఫలాలను పేద ప్రజలకు అందించడంతో పాటు కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడమే తమ ఏకైక ఎజెండా అని అన్నారు. కాంగ్రెస్ పార్టీతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్న ఇతర పార్టీల నాయకులను పార్టీలోకి ఆహ్వానించాలని సూచించారు. నియోజకవర్గంలో ప్రజల మధ్య ఉంటూ పార్టీ కోసం పనిచేసే వారికే ప్రాధాన్యం ఉంటుందని స్పష్టం చేశారు. ఏ ఎన్నికలు వచ్చినా స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగరేలా పార్టీ శ్రేణులు సమష్టిగా పనిచేయాలని పిలుపునిచ్చారు. కార్యకర్తలకు ఏ సమస్య ఉన్నా నేరుగా తనను కలవవచ్చని, న్యాయబద్ధమైన పనులను పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని తెలిపారు. నియోజకవర్గంలోని ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. కాంగ్రెస్ పార్టీ తిరిగి అధికారంలోకి రావడంతో పాటు రేవంత్‌రెడ్డి రెండోసారి ముఖ్యమంత్రి కావాలన్న లక్ష్యంతో ప్రతి కార్యకర్త పనిచేయాలని సూచించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చూసి బీఆర్ఎస్, బీజేపీ నాయకులు ఓర్వలేక ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారని కడియం శ్రీహరి ఆరోపించారు. ఆయా పార్టీల విమర్శలను కాంగ్రెస్ కార్యకర్తలు సమర్థంగా తిప్పికొట్టాలని సూచించారు. బీజేపీ కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు 12 ఏళ్లలో ఏం చేసిందో ప్రజలకు వివరించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రానికి రూ.వెయ్యి కోట్ల విలువైన ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని, జాతీయ స్థాయి సంస్థను మంజూరు చేయలేదని ఆరోపించారు. కుల, మత రాజకీయాలతో ప్రజల మధ్య విభేదాలు సృష్టించడం తప్ప పేదల సంక్షేమంపై బీజేపీ దృష్టి పెట్టడం లేదని విమర్శించారు. బీజేపీకి రాజ్యాంగంపై నమ్మకం లేదని, ఆ పార్టీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల హక్కులకు ముప్పు ఏర్పడుతుందని ఆయన ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అధికారాన్ని అడ్డుపెట్టుకుని భూములు, ఆస్తులు కూడబెట్టుకున్నారని కడియం శ్రీహరి ఆరోపించారు. ధరణిని అడ్డుపెట్టుకుని పేదల భూములను ఆక్రమించుకున్న తీరును ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అసెంబ్లీ సాక్షిగా వివరించారని పేర్కొన్నారు. 2014 ఎన్నికల అఫిడవిట్లో ఆస్తులు లేవని పేర్కొన్న కేసీఆర్ కుటుంబానికి ప్రస్తుతం వందల ఎకరాల భూములు, ఫామ్‌హౌస్‌లు, వేల కోట్ల విలువైన ఆస్తులు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. 2014కు ముందు ఉన్న ఆస్తులు, ప్రస్తుతం ఉన్న ఆస్తుల వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. తెలంగాణలో కేసీఆర్ కుటుంబం మాత్రమే బాగుపడిందని ఆయన ఆరోపించారు. 2029లో జరిగే లోక్‌సభ, శాసనసభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయమే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని కడియం శ్రీహరి పిలుపునిచ్చారు. కొత్త, పాత అనే తేడాలు లేకుండా అందరూ ఐక్యంగా ముందుకు సాగాలని, స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో అగ్రగామిగా నిలిపేందుకు సమష్టిగా కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో హన్మకొండ డీసీసీ అధ్యక్షుడు ఇనుగాల వెంకట్రాంరెడ్డి, జిల్లా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు గుర్రపు ప్రసాద్, మండల కాంగ్రెస్ అధ్యక్షుడు పెసరు రమేష్, వివిధ గ్రామాల సర్పంచులు, జిల్లా, మండల స్థాయి నాయకులు, గ్రామ శాఖ అధ్యక్షులు, మండల కాంగ్రెస్ కమిటీ కార్యవర్గ సభ్యులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.




