స్టేషన్ ఘనపూర్‌లో “సొంతగూటికి” గులాబీ సైనికులు
- కాంగ్రెస్ విడి తిరిగి బీఆర్ఎస్లో చేరికలు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు22 మే, 202609:25 AM

స్టేషన్ ఘనపూర్, మే 22 (ప్రజాధ్వని): ఒకప్పుడు బీఆర్ఎస్ పార్టీకి కంచుకోటగా నిలిచిన స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలో మళ్లీ గులాబీ జెండా రెపరెపలాడుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా గెలిచిన కడియం శ్రీహరి అనంతరం కాంగ్రెస్ పార్టీలో చేరడంతో పలువురు గ్రామ, మండల స్థాయి నేతలు కూడా కాంగ్రెస్ బాట పట్టారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారుతున్నాయనే సంకేతాలు కనిపిస్తున్నాయి. బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు మళ్లీ కేడర్‌తో మమేకమవుతూ పార్టీని బలోపేతం చేసే దిశగా అడుగులు వేస్తుండటంతో కాంగ్రెస్‌లోకి వెళ్లిన పలువురు నేతలు తిరిగి “సొంతగూటికి” చేరుతున్నారు. తెలంగాణ తొలి ఉప ముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య, జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో “గులాబీ సైనికుల రీఎంట్రీ” కార్యక్రమాలు ఊపందుకున్నాయి. “పొరపాటున వెళ్లిన వారు తిరిగి రండి.. సొంతగూటిలో గౌరవం ఉంటుంది” అంటూ నాయకత్వం పిలుపునివ్వడంతో గ్రామస్థాయి కార్యకర్తలు మళ్లీ బీఆర్ఎస్ వైపు అడుగులు వేస్తున్నారు. స్టేషన్ ఘనపూర్‌లో రూ.1400 కోట్ల అభివృద్ధి పనులు చేశామని కడియం శ్రీహరి చెబుతున్నప్పటికీ, పార్టీని వీడిన తరువాత కేడర్‌కు తగిన ప్రాధాన్యత దక్కడం లేదనే భావన కార్యకర్తల్లో వ్యక్తమవుతోందని రాజకీయ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో తిరిగి గులాబీ కండువా కప్పుకుంటున్న నాయకులకు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని జిల్లా నాయకత్వం హామీ ఇస్తోంది. ఈ క్రమంలో జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రామశాఖ అధ్యక్షుడు వల్లాల రాజు, బీఆర్ఎస్ సీనియర్ నాయకులు పెసరు రాజయ్య, వీరారెడ్డి, ముదిరాజ్ సంఘం అధ్యక్షుడు గోదల రాజ్‌కుమార్, బీఆర్ఎస్ యూత్ లీడర్ ఆకారపు ప్రశాంత్‌కుమార్ ఆధ్వర్యంలో ఆకారపు నరేష్కుమార్, గడ్డం రాజు తదితరులు తిరిగి బీఆర్ఎస్ పార్టీలో చేరారు
