ఇందిరమ్మ ఇల్లు వస్తుందని.. ఉన్న ఇల్లూ కూల్చేశారు!
- ఇప్పగూడెంలో రోడ్డున పడ్డ వృద్ధ దంపతులు.. అధికారుల తీరుపై ఆగ్రహం
- ఇల్లు లేక బంధువుల ఇళ్లలో తలదాచుకుంటున్న వృద్ధ దంపతులు
- బాధితులకు న్యాయం చేయాలి: తెలంగాణ రక్షణ సేన ఇన్చార్జి చిలుక ప్రవీణ్
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు28 సెప్టెంబర్, 202611:12 AM

స్టేషన్‌ఘన్‌పూర్, సెప్టెంబర్ 28, ప్రజాధ్వని:
ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్న ఆశతో ఉన్న గూడును కూల్చుకున్నారు.. కొత్త ఇంటి కోసం అడుగు ముందుకేశారు.. అధికారులు, ప్రజాప్రతినిధుల మాటలు నమ్మి పాత ఇంటిని తొలగించుకున్నారు. తీరా ఇప్పుడు ‘ఇల్లు ఇంకా మంజూరు కాలేదు.. ప్రాసెస్‌లో ఉంది’ అంటూ అధికారులు చెప్పడంతో ఆ వృద్ధ దంపతుల ఆశలు ఆవిరయ్యాయి. తలదాచుకునేందుకు సొంత గూడు లేక.. బంధువుల ఇళ్ల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. జనగామ జిల్లా స్టేషన్‌ఘన్‌పూర్ మండలం ఇప్పగూడెం గ్రామానికి చెందిన కోలిపాక వెంకటయ్య, వెంకటమ్మ దంపతుల పరిస్థితి ఇది. వృద్ధ దంపతుల కథనం ప్రకారం.. తమకు ఇందిరమ్మ ఇల్లు మంజూరైందంటూ జూలై 17న స్థానిక ఎమ్మెల్యే కడియం శ్రీహరి మంజూరు పత్రం అందజేశారు. ప్రభుత్వం నుంచి ఇంటి నిర్మాణానికి రూ.5 లక్షలు వస్తాయన్న నమ్మకంతో తమకున్న రేకుల ఇంటిని కూల్చుకున్నారు. అంతేకాకుండా గ్రామ సర్పంచ్ వచ్చి కొబ్బరికాయ కొట్టి భూమిపూజ కూడా చేశారు. దీంతో ఇక తమకు సొంతింటి కల నెరవేరినట్టేనని ఆ వృద్ధ దంపతులు భావించారు. కానీ వారి ఆశలు ఎంతోకాలం నిలవలేదు. ఇంటి నిర్మాణానికి సిద్ధమవుతున్న సమయంలో అధికారులు ‘ఇల్లు ఇంకా మంజూరు కాలేదు.. ప్రక్రియలో ఉంది’ అని చెప్పడంతో వెంకటయ్య దంపతులకు ఏం చేయాలో పాలుపోలేదు. మంజూరు పత్రం చేతిలో ఉండగా.. మంజూరు కాలేదని అధికారులు చెప్పడమేంటన్న ప్రశ్న ఇప్పుడు బాధితులను వెంటాడుతోంది. ఉన్న గూడును తొలగించుకున్న తర్వాత సొంత ఇల్లు లేకపోవడంతో బంధువుల ఇళ్లలో, రేకుల షెడ్డులో తలదాచుకుంటూ కాలం వెళ్లదీస్తున్నామని వారు కన్నీటిపర్యంతమయ్యారు. వృద్ధ దంపతుల దీనస్థితి తెలుసుకున్న తెలంగాణ రక్షణ సేన స్టేషన్‌ఘన్‌పూర్ ఇన్చార్జి చిలుక ప్రవీణ్ సోమవారం ఇప్పగూడెంలోని వారి వద్దకు వెళ్లి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఇందిరమ్మ ఇల్లు మంజూరైందని చెప్పడంతోనే వృద్ధ దంపతులు ఉన్న గూడును కూల్చుకున్నారని, ఇప్పుడు ‘ప్రాసెస్‌లో ఉంది’ అంటూ అధికారులు తప్పించుకోవడం సరికాదన్నారు. పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రభుత్వం చెబుతున్న సమయంలో, ఉన్న ఇల్లు కోల్పోయి రోడ్డున పడిన ఈ వృద్ధ దంపతుల పరిస్థితికి ఎవరు బాధ్యత వహిస్తారో స్పష్టం చేయాలని డిమాండ్ చేశారు. మంజూరు పత్రం ఇచ్చి, ఇంటి నిర్మాణానికి భూమిపూజ చేసిన తర్వాత ఇప్పుడు మంజూరు కాలేదని చెప్పడం వల్ల బాధితులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. నియోజకవర్గంలో గుడిసెలు లేని పరిస్థితి తీసుకొస్తామని ఎమ్మెల్యే కడియం శ్రీహరి చెబుతున్నారని, అలాంటప్పుడు ఇందిరమ్మ ఇల్లు వస్తుందన్న నమ్మకంతో తమ గూడును కోల్పోయిన ఈ వృద్ధ దంపతులకు ముందుగా ఇల్లు కల్పించాల్సిన బాధ్యత కూడా ఉందని చిలుక ప్రవీణ్ అన్నారు. ఎమ్మెల్యే కడియం శ్రీహరి తక్షణమే స్పందించి రాష్ట్రస్థాయి అధికారులతో మాట్లాడి వెంకటయ్య, వెంకటమ్మ దంపతులకు వారం రోజుల్లోగా ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేయించాలని డిమాండ్ చేశారు. సమస్యను పరిష్కరించకపోతే బాధిత వృద్ధ దంపతులను కలెక్టర్ కార్యాలయానికి తీసుకెళ్లి అక్కడే కూర్చోబెట్టి న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కావేరి వినయ్, రాజు, తుడి ప్రశాంత్, ముద్దురపు వినయ్, బొడ్డు వినోద్, చిలుక ప్రశాంత్, తదితరులు పాల్గొన్నారు.

