పల్లా రాజేశ్వర్‌రెడ్డి జోలికొస్తే ఖబడ్దార్!
- కడియం శ్రీహరికి పల్లా అండ లేకుంటే గెలుపు సాధ్యమయ్యేది కాదు
- మారుజోడు రాంబాబుకు బీఆర్ఎస్ నాయకుడు శీలం శ్యామ్ హెచ్చరిక
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు15 అక్టోబర్, 202604:09 AM
స్టేషన్ ఘన్పూర్, అక్టోబరు 15 (ప్రజాధ్వని):పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై అనవసర విమర్శలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ నాయకుడు శీలం శ్యామ్ హెచ్చరించారు.

స్టేషన్ ఘన్పూర్, అక్టోబరు 15 (ప్రజాధ్వని):పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై అనవసర విమర్శలు చేస్తే సహించేది లేదని బీఆర్ఎస్ నాయకుడు శీలం శ్యామ్ హెచ్చరించారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డి మద్దతు లేకుంటే కడియం శ్రీహరి ఎమ్మెల్యేగా గెలిచేవారు కాదని వ్యాఖ్యానించారు. పల్లా రాజకీయ స్థాయిని గుర్తించి మాట్లాడాలని, మారుజోడు రాంబాబు తన పరిధిని తెలుసుకోవాలని హితవు పలికారు. వేలేరు మండలం షోడశపల్లిలో పల్లా రాజేశ్వర్‌రెడ్డి ప్రత్యేకంగా సమావేశం ఏర్పాటు చేసి బీఆర్ఎస్ శ్రేణులు కడియం శ్రీహరికి ఓట్లు వేసేలా మద్దతు కోరారని గుర్తుచేశారు. అలాంటి పల్లా గురించి మాట్లాడే స్థాయి కడియం శ్రీహరికి ఎక్కడిదని ప్రశ్నించారు. కేసీఆర్ రాజకీయంగా అవకాశాలు కల్పించి ఎమ్మెల్సీ, డిప్యూటీ సీఎం పదవులు ఇచ్చారని, ఆయన కుమార్తెకు ఎంపీ టికెట్ కేటాయించినప్పటికీ పార్టీ మారడం విశ్వాసఘాతుకమని ఆరోపించారు. అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌లో చేరానని చెప్పడం సమంజసం కాదన్నారు. ముప్పై ఏళ్ల రాజకీయ నిబద్ధత గురించి మాట్లాడుతున్న కడియం శ్రీహరి.. ఆ కాలంలో ప్రజలకు చేసిన మేలు ఏమిటో వివరించాలని డిమాండ్ చేశారు. ప్రజా ప్రయోజనాల కంటే కుటుంబ ప్రయోజనాలకే ప్రాధాన్యమిచ్చారని విమర్శించారు. నియోజకవర్గ అభివృద్ధికి రూ.1,600 కోట్ల నిధులు ఖర్చు చేశామని చెబుతున్న నాయకులు.. ఆ నిధులతో ప్రజలకు కలిగిన ప్రయోజనాలేమిటో వెల్లడించాలని సవాల్ విసిరారు. ప్రస్తుతం ఏ పార్టీలో ఉన్నారో, ప్రజలకు ఏం చేయాలనుకుంటున్నారో స్పష్టం చేయాలని నిలదీశారు. మారుజోడు రాంబాబు పల్లా రాజేశ్వర్‌రెడ్డి స్థాయిని, రాజకీయ ప్రస్థానాన్ని గుర్తుంచుకుని మాట్లాడాలని శ్యామ్ సూచించారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. జిల్లాకు ఇబ్బందులు కలిగించే ప్రయత్నాలు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. జనగామ జిల్లా ఏర్పాటును అడ్డుకున్నదెవరో ప్రజలకు తెలుసన్నారు. కడియం శ్రీహరి, ఆయన అనుచరులు ఎన్ని విలేకరుల సమావేశాలు నిర్వహించినా ప్రజలకు వాస్తవాలు తెలుసని పేర్కొన్నారు. రాజకీయంగా ఎవరు ఎవరికి అండగా నిలిచారు? ప్రజలకు ఎవరు ఏం చేశారు? అన్నది ప్రజలకు స్పష్టంగా తెలుసన్నారు. పల్లా రాజేశ్వర్‌రెడ్డిపై విమర్శలతో వాస్తవాలను కప్పిపుచ్చలేరని శ్యామ్ స్పష్టం చేశారు.
