ఓటర్ల జాబితాలపై అప్రమత్తంగా ఉండాలి: ఎంపీ కడియం కావ్య
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు5 జూన్, 202604:02 PM

భూపాలపల్లి, జూన్ 5 ప్రజాధ్వని : ఓటర్ల జాబితాలను రాజకీయ ప్రయోజనాల కోసం వినియోగిస్తూ బీజేపీ ప్రమాదకర రాజకీయాలకు పాల్పడుతోందని వరంగల్ పార్లమెంట్ సభ్యురాలు డాక్టర్ కడియం కావ్య ఆరోపించారు. ఓటు హక్కు పరిరక్షణ కోసం ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, బూత్ లెవల్ ఏజెంట్ (బీఎల్ఏ) సైనికుడిలా పనిచేయాలని పిలుపునిచ్చారు. భూపాలపల్లిలోని ఎల్వీ కన్వెన్షన్‌లో నిర్వహించిన నియోజకవర్గ స్థాయి బూత్ లెవల్ ఏజెంట్ల అవగాహన సదస్సులో ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావుతో కలిసి ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా బూత్ స్థాయి నాయకులకు అవగాహన కల్పించారు.

ఈ సందర్భంగా కడియం కావ్య మాట్లాడుతూ, ఎన్నికల సమయంలోనే కాకుండా ఓటర్ల జాబితాల సవరణ జరిగే ప్రతి దశలోనూ అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే ఓటర్ల జాబితాల్లో పేర్లు తొలగించే ప్రమాదం ఉందని హెచ్చరించారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఓటర్ల జాబితాల అవకతవకల కారణంగా ప్రముఖ నాయకులు సైతం తమ సొంత నియోజకవర్గాల్లో ఓటమి పాలైన సందర్భాలు ఉన్నాయని పేర్కొన్నారు. ఓటర్ల జాబితాల్లో పేర్ల తొలగింపు, అనుమానాస్పదంగా కొత్త పేర్ల చేర్పు వంటి చర్యలు ప్రజాస్వామ్యానికి ముప్పుగా మారుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజల మద్దతుతో గెలవలేకపోతే ఓటర్ల జాబితాల ద్వారానే రాజకీయ లబ్ధి పొందాలని బీజేపీ ప్రయత్నిస్తోందని విమర్శించారు. రాహుల్ గాంధీ దేశవ్యాప్తంగా ఓటు హక్కు పరిరక్షణ, ఎన్నికల వ్యవస్థలో పారదర్శకత కోసం పోరాడుతున్నారని చెప్పారు. వచ్చే మూడు నెలలు బీఎల్ఏలు, బీఎల్వోలు ఇంటింటికీ వెళ్లి ఓటర్ల జాబితాలను పరిశీలించాలని, కొత్త ఓటర్ల నమోదు, చిరునామా మార్పుల సవరణ, తొలగించబడిన పేర్ల గుర్తింపుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. ఓటర్ల జాబితానే ఎన్నికల విజయానికి తొలి అడుగని, బూత్ బలంగా ఉంటేనే పార్టీ బలంగా ఉంటుందని పేర్కొన్నారు. ప్రతి అర్హుడికి ఓటు హక్కు అందేలా చూడటమే కాంగ్రెస్ పార్టీ లక్ష్యమని తెలిపారు.

అనంతరం కడియం కావ్య రూపొందించిన ‘బూత్ లెవల్ ఏజెంట్స్ సంక్షిప్త సమాచారం హ్యాండ్‌బుక్’ను ఆవిష్కరించి బీఎల్ఏలు, డివిజన్ ఇన్‌చార్జ్‌లకు అందజేశారు. కార్యక్రమంలో టీపీసీసీ కోఆర్డినేటర్ సిరాజ్ హుస్సేన్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు బట్టు కర్ణాకర్, ప్రజాప్రతినిధులు, మాజీ ప్రజాప్రతినిధులు, డివిజన్ అధ్యక్షులు, బూత్ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

