ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్‌కు భూములు ఇవ్వం నష్కల్, వంగలపల్లి రైతుల స్పష్టీకరణ
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు3 అక్టోబర్, 202610:54 AM

చిల్పూర్, అక్టోబరు 3 (ప్రజాధ్వని): ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు నష్కల్, వంగలపల్లి గ్రామాలకు చెందిన రైతుల భూములను తీసుకునే ప్రతిపాదనపై రైతులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. తమ జీవనాధారమైన వ్యవసాయ భూములను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇచ్చేది లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు శుక్రవారం స్టేషన్ ఘన్‌పూర్ ఆర్డీవో కార్యాలయానికి చెందిన అధికారులు నష్కల్ గ్రామపంచాయతీకి చేరుకుని రైతుల అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా రైతులు తమ అభ్యంతరాలను అధికారుల ఎదుట స్పష్టంగా వెల్లడించారు. పేద, చిన్న రైతుల భూములను తీసుకోవడం వల్ల వారి కుటుంబాల జీవనోపాధి దెబ్బతింటుందని ఆవేదన వ్యక్తం చేశారు. తరతరాలుగా వ్యవసాయంపై ఆధారపడి జీవిస్తున్న కుటుంబాల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు భూముల సేకరణ ప్రతిపాదనను ప్రభుత్వం పునరాలోచించాలని రైతులు కోరారు. ఈ మేరకు తమ అభ్యంతరాలను పేర్కొంటూ ఆర్డీవో సీనియర్ అసిస్టెంట్ శ్రీ ప్రియకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీనియర్ అసిస్టెంట్లు ఉపేందర్, సత్యనారాయణ, చిల్పూర్ లోకేష్, నష్కల్ జీపీవో యాకయ్య పాల్గొన్నారు. రైతుల తరఫున గంటే లక్ష్మి, చిట్యాల రాజేష్ కన్నా, శాగంటి అనిల్, పాశం దాస్, బిక్షపతి, కరుణాకర్, శాగంటి మణి తదితరులు పాల్గొని తమ అభ్యంతరాలను అధికారులకు తెలియజేశారు.
