యూటర్న్ మూసివేతపై గ్రామస్థుల రాస్తారోకో
- భారీగా స్తంభించిన ట్రాఫిక్.. నచ్చజెప్పిన పోలీసులు
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు11 సెప్టెంబర్, 202602:42 PM

స్టేషన్‌ఘన్‌పూర్ సెప్టెంబర్ 11 ప్రజాధ్వని : జాతీయ రహదారిపై మీదికొండ క్రాస్‌రోడ్డు వద్ద యూటర్న్ మూసివేతకు అధికారులు చేపట్టిన చర్యలను నిరసిస్తూ గ్రామస్థులు శుక్రవారం రాస్తారోకో, ధర్నాకు దిగారు. జేసీబీతో యూటర్న్‌ను మూసివేసేందుకు ప్రయత్నించడంతో విషయం తెలుసుకున్న గ్రామస్థులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకుని ఆందోళన చేపట్టారు. ఇటీవల జాతీయ రహదారిపై ప్రమాదాలు పెరుగుతున్న నేపథ్యంలో ఎన్‌హెచ్ అధికారులు పలు ప్రాంతాల్లో యూటర్న్‌లను మూసివేస్తున్నారు.

ఇందులో భాగంగా మీదికొండ వద్ద సిమెంట్ దిమ్మెలతో యూటర్న్‌ను తాత్కాలికంగా మూసివేశారు. దీంతో స్టేషన్‌ఘన్‌పూర్ నుంచి గ్రామానికి వచ్చే వాహనదారులు రాఘవాపూర్ బస్టాండ్ వరకు వెళ్లి యూటర్న్ తీసుకోవాల్సి వస్తోందని గ్రామస్థులు తెలిపారు. మీదికొండ నుంచి జనగామ వైపు వెళ్లేవారికి ఇబ్బందులు మరింత పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చాగల్లు దాటిన తర్వాత కెనాల్ వద్ద యూటర్న్ తీసుకుని జనగామ వైపు వెళ్లాల్సి రావడంతో అదనంగా సుమారు మూడు కిలోమీటర్లు ప్రయాణించడంతో పాటు సమయం వృథా అవుతోందన్నారు. యూటర్న్ పూర్తిగా మూసివేస్తే కొందరు వాహనదారులు రాంగ్‌రూట్‌లో ప్రయాణించే ప్రమాదం ఉందని, తద్వారా ప్రమాదాలు మరింత పెరిగే అవకాశం ఉందని పేర్కొన్నారు. ఇటీవల జగద్గిరిగుట్ట నుంచి హుస్నాబాద్ వైపు మీదికొండ మీదుగా ఆర్టీసీ బస్సు సర్వీసు ప్రారంభమైందని, యూటర్న్ మూసివేస్తే అదనపు కిలోమీటర్ల కారణంగా ఆ సర్వీసు నిలిచిపోయే ప్రమాదం ఉందన్నారు. సర్వీస్ రోడ్డు, బ్రిడ్జి ఏర్పాటు చేసిన తర్వాతే యూటర్న్‌ను శాశ్వతంగా మూసివేయాలని డిమాండ్ చేశారు.

యూటర్న్ వద్ద గ్రామస్థులు బైఠాయించడంతో సుమారు 20 నిమిషాల పాటు ట్రాఫిక్ స్తంభించి, మూడు కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఎన్‌హెచ్ అధికారులు అక్కడికి చేరుకుని గ్రామస్థులతో చర్చించారు. వారి అభ్యర్థన మేరకు అధికారులు తాత్కాలికంగా పనులు నిలిపివేసి యూటర్న్‌లో ఒక వైపు రాకపోకలకు అవకాశం కల్పించారు. దీంతో పోలీసులు, అధికారులు నచ్చజెప్పడంతో గ్రామస్థులు ఆందోళన విరమించారు. కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ జోగు సంపత్‌కుమార్, ఉపసర్పంచ్ ఆలకుంట శ్రీనివాస్, కాంగ్రెస్ గ్రామశాఖ అధ్యక్షుడు గుర్రం ప్రశాంత్, మాజీ ఉపసర్పంచ్ పొన్న రంజిత్, గ్రామస్థులు జోగు రవి, జోగు సలీం, కుమ్మరాజుల మహేష్, రాజేష్, వడ్లకొండ రవి తదితరులు పాల్గొన్నారు.
