మహిళా బిల్లుతో డీలిమిటేషన్ కలపడం రాజకీయ కుట్ర_ఎమ్మెల్యే కడియం శ్రీహరి
ప్ర
ప్రజాధ్వని డెస్క్
ఏరియా వివరాలు లేవు19 ఏప్రిల్, 202607:08 AM

చిల్పూర్ మండలం మల్కాపూర్ గ్రామంలో ఐకెపి ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభించిన ఎమ్మెల్యే కడియం శ్రీహరి. ఈ సందర్బంగా ఎమ్మెల్యే కేంద్ర ప్రభుత్వం, భారతీయ జనతా పార్టీపై తీవ్ర విమర్శలు చేశారు. రైతాంగంపై నిజమైన ప్రేమ ఉంటే స్వామినాథన్ కమిషన్ సిఫారసులను అమలు చేసి, ప్రస్తుత ఖర్చులను దృష్టిలో పెట్టుకొని పంటలకు మద్దతు ధరలు పెంచాలని డిమాండ్ చేశారు. రైతు, పేదలు, మహిళల సమస్యల కంటే కులాలు, మతాలు, దేవాలయాల రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తున్నారని విమర్శించారు. తెలంగాణ ఏర్పాటును అడుగడుగున అవమానించే విధంగా బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ ఏర్పాటుపై అవమానకర వ్యాఖ్యలు చేయడం, దాన్ని ‘బ్లాక్ డే’గా పేర్కొనడం వంటి వ్యాఖ్యలు ప్రజల మనోభావాలను దెబ్బతీస్తున్నాయని అన్నారు. గత 12 సంవత్సరాల్లో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు ఒక్క పెద్ద ప్రాజెక్ట్, విశ్వవిద్యాలయం లేదా గణనీయమైన ఆర్థిక సహాయం ఇవ్వలేదని ఆరోపించారు. కేంద్ర మంత్రులు, రాష్ట్ర బీజేపీ నాయకులు ఈ వ్యాఖ్యలపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లు విషయంలో కూడా బీజేపీ రాజకీయ ప్రయోజనాల కోసం డీలిమిటేషన్ను కలిపి తీసుకురావాలని చూస్తోందని విమర్శించారు. డీలిమిటేషన్ జరిగితే జనాభా ప్రాతిపదికన దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గే ప్రమాదం ఉందని, కుటుంబ నియంత్రణ పాటించి అభివృద్ధి సాధించిన రాష్ట్రాలు నష్టపోతాయని అన్నారు. అన్ని రాజకీయ పార్టీలు డీలిమిటేషన్ను వేరుగా ఉంచి మహిళా బిల్లును మాత్రమే తీసుకురావాలని కోరినా బీజేపీ అంగీకరించడం లేదని తెలిపారు. మహిళలకు 33 శాతం రిజర్వేషన్ ఇవ్వాలనే నిజమైన ఉద్దేశం కాకుండా, ఉత్తరాది రాష్ట్రాల్లో సీట్లు పెంచుకోవడమే లక్ష్యంగా బిల్లు రూపకల్పన చేస్తున్నారని ఆరోపించారు. మహిళా బిల్లును ఒక్కదాన్నే పార్లమెంటులో ప్రవేశపెడితే అన్ని పార్టీలు ఏకగ్రీవంగా ఆమోదిస్తాయని స్పష్టం చేశారు. బీజేపీ ప్రతి అంశాన్ని రాజకీయ ప్రయోజనాల కోసమే వినియోగిస్తోందని, పేదలు, మహిళలు, రైతుల సంక్షేమం పట్ల ఆ పార్టీకి నిజమైన కట్టుబాటు లేదని ఎమ్మెల్యే కడియం శ్రీహరి విమర్శించారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ చైర్మన్ లావణ్య శిరీష్ రెడ్డి, దేవస్థాన చైర్మన్ పొట్లపల్లి శ్రీధర్ రావు, గ్రామ సర్పంచ్ లావణ్య మల్లారెడ్డి, అధికారులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

